22, ఫిబ్రవరి 2012, బుధవారం

సన్-జు 'యుద్ధకళ': 13వ అధ్యాయం





యుద్ధకళ



13వ అధ్యాయం: గూఢచారులు








సన్జు చెప్పాడు:

1) లక్షమంది సైనికులున్న సైన్యాన్ని పెంపొందించి, దానిని మిక్కిలి దూరాలు నడిపించడం అనేది ప్రజలు భారీగా నష్టపోవడానికీ, సామ్రాజ్య వనరులు వృధా అయిపోవడానికీ దారితీస్తుంది. రోజుకి వేయి ఔన్సుల వెండి ఖర్చవుతుంది. ఇంటా, బయటా కూడా అలజడి బయలుదేరుతుంది. సైనికులు రహదారులలో అలసిపోయి కూలబడిపోతారు. ఏడు లక్షల కుటుంబాలు చేసే పనికి అంతరాయం కలుగుతుంది.

(ప్రాచీన చైనాలో ఎనిమిదేసి కుటుంబాలు కలసి కొంత పొలాన్ని ఉమ్మడిగా సాగు చేస్తుంటాయి. ఆ ఎనిమిదింటిలో ఒక కుటుంబం లోని పనిచేసే వ్యక్తి అవసరమైనపుడు యుద్ధంలో పాల్గొనాలి. ఆసమయంలో ఆ కుటుంబం యొక్క పోషణా భారాన్ని మిగతా ఏడు కుటుంబాలు వహిస్తాయి. ఆ విధంగా లక్ష మంది యుద్ధానికి వెళితే అది ఏడు లక్షల కుటుంబాలకు భారంగా పరిణమిస్తుంది.)

2) ఒకేఒక రోజులో నిర్ణయించబడే విజయం కొరకు పోరాడుతూ ఇరుసైన్యాలూ సంవత్సరాల తరబడి ఒకదానినొకటి ఎదుర్కొంటాయి. అటువంటపుడు నజరానాలు, జీతభత్యాల రూపంలో కేవలం ఒక వంద ఔన్సుల వెండిని ఖర్చుచేయడానికి అనిష్టత చూపడం దానివలన శత్రువు పరిస్థితి గురించి ఏమీ తెలియకుండా ఉండిపోవడంఅనేది మొరటుతనానికి పరాకాష్ట.

3) ఆ విధంగా ప్రవర్తించేవాడు సైనికులకు నాయకుడు కాలేడు, తన ప్రభువుకు తక్షణ సహాయాన్ని అందించలేడు, విజయాన్ని నియంత్రించలేడు.

4) ఆ విధంగా, ఒక వివేకవంతుడైన సార్వభౌముడూ, ఒక మంచి సేనానీ దాడిచేసి, విజయం సాధించి, సామాన్యులకు సాధ్యం కాని వాటిని సాధించేటట్లుగా చేసేది ఏమిటంటేఅది ముందస్తు సమాచారం.

5) ఈ ముందస్తు సమాచారాన్ని ప్రేతాత్మలనుండి పొందలేము; గతానుభవాలను బేరీజు వేయడం వలన పొందలేము; ఎటువంటి తార్కికమైన గణింపు ద్వారా కూడా పొందలేము.

6) శత్రు పథకాలను గురించిన సమాచారాన్ని కేవలం ఇతర వ్యక్తుల నుండి మాత్రమే పొందగలం.

7) కనుకనే గూఢచారులను ఉపయోగించాలి. ఈ గూఢచారులు ఐదు రకాలుగా ఉంటారు:

1) స్థానిక గూఢచారులు;

2) అంతర్గత గూఢచారులు;

3) మార్చబడిన గూఢచారులు;

4) దురదృష్ట గూఢచారులు;

5) బ్రతికిపోయిన గూఢచారులు.

8) ఈ ఐదు రకాలైన గూఢచారులు అందరూ పని చేస్తున్నపుడు, ఆ రహస్య వ్యవస్థను ఎవరూ కనిపెట్టలేరు. దీనిని దైవికమైన చాకచక్యంగా పిలుస్తారు. ఇది సార్వభౌముడి అతి విలువైన విభాగం.

9) స్థానిక గూఢచారులను కలిగి ఉండటం అంటే శత్రుదేశపు పౌరులను గూఢచారులుగా నియోగించడం.

10) అంతర్గత గూఢచారులను కలిగి ఉండటం అంటే శత్రువుకు చెందిన అధికారులను గూఢచారులుగా ఉపయోగించుకోవడం.

11) మార్చబడిన గూఢచారులను కలిగి ఉండటం అంటే, శత్రు గూఢచారులను పట్టుకుని, వారిని మన గూఢచారులుగా వినియోగించడం.

12) దురదృష్ట గూఢచారులను కలిగి ఉండటం అంటే, మన గూఢచారులకే తప్పుడు సమాచారం అందించి అది శత్రువుకు చేరేటట్లు చూడటం.

(కావాలని కొన్ని పనులను బహిరంగంగా చేసి, వాటి గురించి మన గూఢచారులు తెలుసుకొనే వీలు కల్పించాలి. శత్రువుకు వారు పట్టుబడినపుడు, అతడు వారినుండి ఆ సమాచారాన్ని రాబట్టి, తదుపరి వారిని మట్టుబెడతాడు. ఆనక ఆ మోసపూరితమైన సమాచారం ప్రకారంగానే అతడు కార్యరంగంలోకి దూకుతాడు. స్వంతరాజు చేత మోసగింపబడి, శత్రురాజు చేతిలో మరణిస్తారు కనుక వీరు దురదృష్ట గూఢచారులు.)

13) బ్రతికిపోయిన గూఢచారులంటే శత్రుశిబిరం నుండి సమాచారం గ్రహించి, తిరిగి వచ్చేవారు.

(శత్రువు చేతికిచిక్కి, మరణించకుండా మరలా తిరిగి వచ్చారు కనుక వీరు బ్రతికిపోయిన గూఢచారులు.)

14) కనుక సైన్యం మొత్తంలో గూఢచారులతో కన్నా మరింత ఎక్కువగా మనం సన్నిహిత సంబంధాలను కలిగి ఉండటానికి మరెవరూలేరు. వీరి కన్నా ఎక్కువ ఉదారంగా మరెవరికీ బహుమతులీయకూడదు. మరే ఇతర వ్యవహారంలోనూ ఇంతకన్నా ఎక్కువ రహస్యాన్ని పాటించకూడదు.

15) ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగలిగేంతటి ప్రతిభావిశేషాలు లేకుండా గూఢచారులను ఉపయోగకరంగా నియోగించడం సాధ్యం కాదు.

(వాస్తవానికీ, భ్రమకూ; నిజాయితీకి, కపటత్వానికీ తేడా తెలుసుకోగలిగి ఉండాలి)

16) ఉదారత, నిజాయితి లేకుండా వారిని తగినవిధంగా నిర్వహించడం సాధ్య కాదు.

(వారికి ఇవ్వజూపిన మొత్తాన్ని ఉదారంగా, నిజాయితీగా ఇచ్చివేయాలి. అప్పుడు వారు నీకొరకు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తారు.)

17) సూక్ష్మగ్రాహ్యత లేకుండా వారి నివేదికలలోని నిజాన్ని నిగ్గుదేల్చలేము.

(వారు శత్రువు తరపున పనిచేసే అవకాశం ఉన్న విషయాన్ని నీవు దృష్టిలో ఉంచుకోవాలి)

18) దుర్గ్రాహ్యంగా ఉండు! అంతుచిక్కకుండా ఉండు! నీ గూఢచారులను అన్ని రకాల వ్యవహారాలలో నియోగించు!

19) ఒకానొక రహస్య సమాచారాన్ని గూఢాచారి ముందే బట్టబయలు చేస్తే అతడిని, ఆ రహస్యం చెప్పబడిన వ్యక్తితో కలిపి మరణ దండనకు గురిచేయాలి.

20) ఒక సైన్యాన్ని చిత్తుచేయాలన్నా, ఓ నగరం మీద విజయవంతంగా దాడిచేయాలన్నా, లేక ఓ వ్యక్తిని హత్య చేయాలన్నా లక్ష్యమేదైనా సరే సంబంధిత సేవకులు, సహాయకులు, ద్వారపాలకులు, సేనాని గస్తీ సైనికులు వీరందరి పేర్లను తెలుసుకోవడంతో పనిని ప్రారంభించడం ఎల్లప్పుడూ అవసరం. ఈ పేర్లను నిర్ధారించే పనిని  మన గూఢచారులకు తప్పనిసరిగా అప్పగించాలి.

(లంచాలద్వారా వీరిలో కొందరిని మనకు అనుకూలురుగా మార్చుకోవచ్చు)

21) మన మీద గూఢచర్యం చేయడానికి వచ్చిన శత్రు గూఢచారులను కనిపెట్టి, బంధించి లంచాలు ఇవ్వజూపడం ద్వారా, మంచి వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారావారిని లోబరచుకోవాలి. ఆ విధంగా వారు మార్చబడిన గూఢచారులుగా రూపొంది మన సేవకు వినియోగపడతారు.

22) మార్చబడిన గూఢచారి అందించిన సమాచారం ద్వారానే మనం స్థానిక గూఢచారులను, అంతర్గత గూఢచారులను సంపాదించటం గానీ, వారిని మన సేవలో నియోగించడం గానీ సాధ్యమౌతుంది.

(తన దేశ పౌరులలో దురాశాపరులెవరో, తన దేశ అధికారులలో అవినీతిపరులెవరో అతడికి తెలుసు)

23) అతడందించిన సమాచారం మూలంగానే మనం దురదృష్ట గూఢచారి ద్వారా శత్రువుకు తప్పుడు సమాచారం చేరవేయగలం.

(తనవారిని ఏ విధంగా మోసం చేయవచ్చో మార్చబడిన గూఢచారికి తెలుసు)

24) అతడిచ్చిన సమాచారం ద్వారానే మనం బ్రతికిపోయిన గూఢచారులను నిర్దిష్టసమయాలలో వినియోగించుకోగలం.

25) మొత్తం ఈ ఐదురకాల గూఢచర్య విధానాల ఉద్దేశ్యం, లక్ష్యం శత్రువు గురించిన సమాచారమే. మనం మొట్టమొదటగా ఈ సమాచారాన్ని మార్చబడిన గూఢచారి నుండి మాత్రమే రాబట్టగలం. కనుక అతడితో ఎంతో ఆదరంగా వ్యవహరించడం చాలా అవసరం.

26) గతంలో యిన్రాజవంశ ప్రాభవానికి కారణం సియారాజ్య ఉద్యోగి అయిన ఇఛి’. అలాగే చౌరాజవంశ ప్రాభవానికి కారణం యిన్రాజ్య ఉద్యోగి అయిన లుయా’.

27) కనుక, కేవలం ప్రాజ్ఞుడైన పాలకుడూ, వివేకవంతుడైన సేనానీ మాత్రమే సైన్యంలోని ప్రతిభావంతులను గూఢచర్యం కొరకు వినియోగించుకొని అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. యుద్ధంలో గూఢచారులు అతి ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఒక సైన్యం కదలగలగటం అనేది వారి మీదనే ఆధారపడి ఉంటుంది.




(సన్-జు 'ద ఆర్ట్ ఆఫ్ వార్' సమాప్తం)





[యుద్ధాన్ని దాటవేయకు. నీవు అలా చేయాలనుకుంటే అది కేవలం వాయిదా మాత్రమే వేయబడుతుంది. అది కూడా నష్టదాయకంగా మాత్రమే ముగుస్తుంది.
--మాకియవెల్లి]   




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి